అడుగు వేస్తే పగుళ్లు పడే వంతెన అయినా నడవొచ్చు ధైర్యంగా..!

0
26

చైనాలో గాజు వంతెనల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేల అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ వంతెనలపై నుంచి నడవాలంటే చాలా ధైర్యం ఉండాల్సిందే. నడుస్తుండగానే వంతెన పగిలిపోతుందేమోనని చాలా మంది భయపడకమానరు. అయినా సరే వీటికి పర్యటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇందులోని ఓ వంతెన ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారిందట. అడుగు వేస్తే చాలు పగుళ్లు పడుతోందట. వింటుంటేనే వామ్మో అనిపిస్తుంది కదా.. మరి ఈ పగుళ్ల వెనుక రహస్యం ఏమిటంటే..

ఉత్తర చైనాలోని హుబేయి ప్రావిన్స్‌లో ఈస్ట్‌ తైహెంగ్‌ గ్లాస్‌వాక్‌ పేరుతో గాజువంతెన ఉంది. 872 అడుగుల పొడవు, 6.6అడుగుల వెడల్పుతో భూమికి 3800 అడుగుల ఎత్తులో ఉండే ఈ వంతెన ఇటీవల పర్యాటకులు అడుగు పెడితే చాలు పగుళ్లు పడుతోంది. దీంతో వంతెన ఎక్కినవారు భయంతో కేకలు వేస్తున్నారు. అయితే ఈ పగుళ్లు నిజం కాదట. పర్యాటకులను ఆకర్షించేందుకు బ్రిడ్జ్‌కు స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ ఏర్పాటుచేశారు అక్కడి నిర్వాహకులు. దీంతో పర్యటకులు అడుగులు వేస్తున్నప్పుడు వంతెన పగిలినట్లు కన్పిస్తుంది. ఇన్ఫ్రారెడ్‌ సెన్సార్స్‌ సాయంతో టూరిస్టుల అడుగులను గుర్తించి.. వెంటనే పగుళ్లు వచ్చేలా ఏర్పాటుచేశారు. నిజంగానే వంతెన పగిలిపోతుందా అనే భావన కలిగిస్తుంది.

అయితే కేవలం వంతెన చివరి భాగంలో మాత్రమే ఈ ఎఫెక్ట్స్‌ను ఏర్పాటుచేశారు. దీనికి సంబంధించిన వీడియోను చైనా పీపుల్స్‌ డెయిలీ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేసింది. వంతెనపై నడిచే పర్యాటకులే కాదు.. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా దేవుడా! అనుకుంటున్నారు. అయితే ఈ గాజు వంతెను అత్యంత భద్రతా ప్రమాణాలతోనే నిర్మించామని.. దీనిపై ఎలాంటి భయం లేకుండా నడవొచ్చు అంటున్నారు నిర్వాహకులు.

Watch Video:


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here