‘తల్లి బిడ్డకు బహిరంగంగా పాలిస్తే తప్పేంటి’…?

0
276

ప్రసవవేదనతో నరకయాతన అనుభవించిన తల్లి బిడ్డను చూశాక, తాకుతూ.. ముద్దాడుతూ ఆ బాధనంతటినీ మర్చిపోతుంది. పేగుబంధంతో ముడిపడిన ఆ ప్రాణబంధం అలాంటిది మరి. అలాంటి తల్లి బిడ్డ ఆలనాపాలనా చూస్తూ మురిసిపోతుంటుంది. ఏడుస్తున్న తన బిడ్డకు పాలిస్తుంది, లాలిస్తుంది. అంతటి మాతృమూర్తి బిడ్డకు బహిరంగంగా పాలిస్తే తప్పేంటి అనే ఓ కొత్త వాదనను కేరళ మ్యాగజైన్ గృహలక్ష్మి తెరపైకొచ్చింది. చాటుమాటుగా చీర కప్పుకునో, ఏదో తప్పు చేస్తున్నట్లు ఏదైనా వస్త్రం ఛాతిపై వేసుకునో ఎందుకు పాలివ్వాలని ఆ మ్యాగజైన్ ప్రశ్నిస్తోంది. బహిరంగంగా బిడ్డకు పాలిస్తే ఎందుకు సిగ్గుపడాలని, ఏదో అపరాధం చేస్తున్నట్లు ఎందుకు ఆత్మన్యూనతతో భయపడాలని వాదిస్తోంది.అంతేకాదు, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘‘బ్రెస్ట్‌ఫీడ్ ఫ్రీలీ’’ అనే ఓ క్యాంపెయిన్‌ను కూడా నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి ఇద్దరు మహిళలు బిడ్డకు బహిరంగంగా పాలిస్తున్న ఫొటోలను గృహలక్ష్మి మ్యాగజైన్ కవర్ పేజ్‌పై పోస్ట్ చేసి సంచలనానికి తెరలేపారు ఆ మ్యాగజైన్ నిర్వాహకులు. ఆ ఇద్దరు మహిళలలో ఒకరు మోడల్. అసలీ వాదనకు కారణం ఏంటంటే… అమృత అనే ఓ 23ఏళ్ల గృహిణి తన నెలన్నర బిడ్డకు పాలిస్తున్నఫొటోను ఆమె అంగీకారంతో తన భర్త ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో వైరల్‌గా మారింది. సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకే తెరలేపింది. ఈ ఫొటో స్పూర్తితో గృహలక్ష్మి మ్యాగజైన్ ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోంది. అమృతతో గృహలక్ష్మి మ్యాగజైన్ మాట్లాడిన సందర్భంలో ఆమె చెప్పిన మాటలు చర్చకు దారితీశాయి. అమృత మాట్లాడుతూ.. ‘ నేను బిడ్డను కన్న తర్వాత ఆసుపత్రిలో ఉన్నప్పుడు బహిరంగంగా బిడ్డకు పాలిచ్చేదాన్ని. చాలామంది పక్కనున్న వారు ఆ భాగాన్ని కప్పుకోమని చెప్పారు. అంతేకాదు, అలా బహిరంగంగా బిడ్డకు పాలివ్వడం వల్ల పాలు పడటం తగ్గిపోతాయని అన్నారు. అప్పటి వారి మూఢనమ్మకాలను ఇప్పటి యువతపై కూడా రుద్దాలని చూస్తున్నారు. ఒకరైతే.. నేను బిడ్డకు పాలిస్తుండగా ఓ టవల్‌ను నాపై విసిరేశారు. ఆ టవల్‌ను నేను తీసేయడానికి ప్రయత్నించాను’’ అని చెప్పింది. ఈ కవర్ ఫొటోకు ఫోజిచ్చిన రచయిత్రి, నటి, మోడల్ గిలు జోసెఫ్ మాట్లాడుతూ.. ఎవరైతే బిడ్డకు బహిరంగంగా పాలివ్వడం గర్వ కారణంగా భావిస్తారో.. అలాంటి వారందరికీ తన ఫొటోను అంకితం చేస్తున్నట్లు ప్రకటించింది.అయితే ఈ ఫొటోలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బిడ్డకు పాలివ్వడం తప్పు కాదని, కానీ మగవారిలో శృంగారపరమైన భావోద్రేకాలను కలిగించే ఓ భాగాన్ని బహిరంగంగా చూపించడం తప్పని విమర్శకులు వాదిస్తున్నారు. అయితే పాలు తాగే బిడ్డను చూడకుండా, ఆమె స్తనం వంక చూసే సంకుచిత మనస్తత్వాన్ని ఇకనైనా వీడాలని క్యాంపెయిన్ నిర్వాహకులు పిలుపునిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here